దేశంలో ఆరోగ్య సంక్షోభంపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక.. 2027 సెప్టెంబర్ వరకు ఎల్‌నినో ప్రభావంతో వడదెబ్బ, వ్యాధుల ముప్పు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత్‌లో తలెత్తబోయే తీవ్ర ఆరోగ్య సంక్షోభంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ‘గ్రేడ్-3 ఎమర్జెన్సీ’ని ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ, భారత్‌ను హైరిస్క్ జాబితాలో చేర్చింది. 2027 సెప్టెంబర్ వరకు ‘ఎల్‌నినో’ ప్రభావం కొనసాగనుండటంతో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే ముప్పు పొంచి ఉందని తెలిపింది. ముఖ్యంగా గుండె, కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులపై ఈ వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. మరోవైపు, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల దిగుబడి తగ్గి దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం కూడా ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణమే దేశంలోని ఆరోగ్య రంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ సూచించింది.