తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు వెలుపల శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. కాగా, నిన్న ఒక్కరోజే 70,124 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 32,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.92 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ ప్రకటించింది.