అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’..
వాషింగ్టన్: అమెరికా గగనతలంలో సాంకేతిక సంక్షోభం తలెత్తడంతో విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలం కావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లను నిలిపివేస్తూ ‘గ్రౌండ్‌స్టాప్’ ఆదేశాలు జారీ చేసింది.
ఈ అకస్మాత్తు నిర్ణయంతో అమెరికా వ్యాప్తంగా 11 వేలకు పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటిలో వెయ్యికి పైగా విమానాలు పూర్తిగా రద్దు కాగా, సుమారు 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఆదేశాలు జారీ చేసే సమయానికి అప్పటికే గాల్లో ఉన్న 4,042 విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. కాగా, 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో ఇలా దేశవ్యాప్తంగా విమానాలను నిలిపివేయడం (గ్రౌండ్‌స్టాప్) ఇది రెండోసారి కావడం గమనార్హం.