తూముకుంటలో 70వ ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలు ప్రారంభం
శామీర్‌పేట, మేజర్ న్యూస్: విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్ తూముకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 70వ ఎస్‌జీఎఫ్‌ఐ అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి ఖో ఖో టోర్నమెంట్‌ను అలియాబాద్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి లక్షణాలను అలవర్చుతాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కమలాకర్, మాజీ చైర్మన్ కె. రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ బి. చంద్రశేఖర్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ అనిత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుర్రం సత్తిరెడ్డి, పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.