వైసీపీ అభ్యర్థుల గెలుపునకు బడే గౌతమ్ విస్తృత ప్రచారం నెరవేరని హామీలు.. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ఓటేయండి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వైసీపీ అభిమాని, యువ న్యాయవాది బడే గౌతమ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ప్రజలు మద్దతుగా నిలిచి, విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మండల పరిధిలోని పాత ఎడ్లంక, వేకనూరు, పులిగడ్డ తదితర సెగ్మెంట్లలో ప్రచారం నిర్వహిస్తూ,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేకం ఇంకా నెరవేరలేదని గౌతమ్ పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, పెరిగిన ధరల భారాన్ని, అమలుకాని హామీలను దృష్టిలో పెట్టుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ప్రజా సమస్యల పరిష్కారానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈయనతో పాటు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దోవ గోవర్ధన్, మాజీ జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ వర్రే నరేష్, మాజీ సర్పంచ్ దాసరి విజయ్, మాజీ నీటి సంఘ అధ్యక్షులు వర్రె బసవారావు, పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.