వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకె గంగవరం మండలంలో కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని సత్యవాడ గ్రామ జనసేన నాయకులు,జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.మండలంలో జెడ్పీటీసీ,ఎంపీపీ పదవులతోపాటు వైస్ ఎంపీపీ పదవిని కూడా తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తే జనసేనకు ప్రాతినిధ్యం ఎక్కడని ప్రశ్నిస్తున్నారు.కూటమి విజయానికి జనసేన చేసిన కృషిని విస్మరించడం తగదని స్పష్టం చేస్తున్నారు.సత్యవాడకు చెందిన శిరగం గంగాభవాని గత ఎంపీటీసీ ఎన్నికల్లో 1,416 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారని,ప్రజల్లో ఆమెకు ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు.ఇంతటి ప్రజాబలంతో గెలిచిన జనసేన ప్రతినిధికి వైస్ ఎంపీపీ పదవి దక్కకపోతే పార్టీ శ్రేణులకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు.అన్ని పదవులూ ఒకే పార్టీకి కట్టబెట్టడం కూటమి రాజకీయ స్ఫూర్తికి విరుద్ధమని,భాగస్వామ్య పార్టీలకు తగిన గౌరవం,ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటున్నారు.జనసేన అధినేత,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై దృష్టిసారించి శిరగం గంగాభవానికి వైస్ ఎంపీపీ పదవి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.