andhrapradesh
వార్తలు ప్రసారం చేస్తే..నోటీసులిస్తారా?...
- తప్పును ప్రశ్నించడం మీడియా బాధ్యత.......అంత మాత్రాన పోలీసులు బెదిరించడం పరిష్కారం కాదు!...
- జిల్లా పోలీస్ కార్యాలయ బహిరంగ ప్రకటనను ఖండించిన జర్నలిస్టుల యూనియన్లు...
విజయనగరం మేజర్ న్యూస్: విజయనగరం టాక్సీ స్టాండ్ సమీపంలో పోలీస్ బూత్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారులకు, పోలీసులకు మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై వార్తలు రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలు, యూ ట్యూబర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పోలీసు శాఖ ప్రకటన విడుదల చేయడం శోచనీయం.ఈ చర్యని జర్నలిస్ట్ యూనియన్లు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు వచ్చి నిర్మాణాన్ని తొలగించిన సందర్భంలో తెలెత్తిన వివాదాన్ని వార్తగా రాయడం , చూపడం జర్నలిస్టుల బాధ్యత.. ఇది తప్పెలా అవుతుంది ?. ఒక ఘటన జరిగినప్పుడు దానిపై వార్తలు రాయడం, ప్రశ్నలు సంధించడం మీడియా బాధ్యత. ఆ క్రమంలో ఏదైనా వార్తలో వాస్తవ దోషాలు ఉంటే వాటిని ఆధారాలతో ఖండించవచ్చు. సంబంధిత మీడియా సంస్థలకు వివరణ కోరవచ్చు. అంతే గానీ , వార్తలు రాసిన, ప్రసారం చేసిన వారిపై విచారణ, నోటీసులు, చర్యల హెచ్చరికలు జారీ చేయడం ద్వారా రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా నిలిచే మీడియా హక్కులను ముమ్మాటికీ కాలరాయడమే! పోలీసుల గౌరవం ఎంత ముఖ్యమో.. మీడియా స్వేచ్ఛ కూడా అంతే ముఖ్యం. అధికారుల చర్యలను ప్రశ్నించడం వ్యవస్థను కించపరచడం కాదు. ప్రజల తరపున ప్రశ్నించడం. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఈ బాధ్యత కచ్చితంగా ఉంది. వార్త తప్పయితే చెప్పాలి. ఆధారాలతో ఖండించాలి. కానీ ప్రశ్నించే గొంతుకలకు నోటీసులిచ్చి భయ పెట్టకూడదు. వార్తలు రాసిన, మీడియా ప్రసారం చేసిన కథనాల్లో ఏమైనా నిరాధార ఆరోపణలు ఉంటే? , పారదర్శకమైన సమాధానాలతో మీడియాకి వివరణ ఇవ్వొచ్చు. ఈ పరిస్థితుల్లోనే విజయనగరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పై జిల్లా పోలీస్ శాఖ బహిరంగంగా విడుదల చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తూ. .విజయనగరం జిల్లా కేంద్రంలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు ఏపీ యూ డబ్ల్యూ జె , ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ , జాప్ , ఏపీ జె ఎఫ్ , టి జె ఎఫ్ , స్మాల్ పేపర్స్ యూనియన్, డిస్ట్రిక్ట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ లు ఖండించాయి.