ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్
ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసి ఎన్నికలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉండే అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రజల ఆశీస్సులతో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉయ్యూరు ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులు విజయం సాధించాలని, ప్రతి వార్డులో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉయ్యూరు గ్రామీణ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి కంబం రమేష్, ఎంపీపీ అభ్యర్థి వేమూరి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి రాజేంద్ర ప్రసాద్ హాజరై అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. మండలంలోని గ్రామాల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, అబ్దుల్ కుద్దుస్, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, రత్నం శివప్రసాద్, కోడే హరీష్, టీడీపీ–జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, ఉయ్యూరు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.