ఉయ్యూరులో బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం.. మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు
మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: గన్నవరం డీఎస్పీ జయకృష్ణ
ఉయ్యూరు, మేజర్ న్యూస్ : ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో సాయిపురం గ్రామానికి చెందిన కూచిపూడి రాంబాబు (23)ను ఉయ్యూరు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మెకానిక్‌గా పనిచేస్తున్న రాంబాబు తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాలిక మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరగా కులాన్ని కారణంగా చూపుతూ నిరాకరించినట్లు తెలిపారు. బాలిక దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్‌ఎస్, పోక్సో, ఎస్సీ–ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ కే. జయకృష్ణ దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మరో ముగ్గురి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాలను బట్టి వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ప్రేమ, పెళ్లి పేరుతో బాలికలను మోసగించి లైంగిక దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచి అవసరమైన రక్షణ, సహాయం అందిస్తామని తెలిపారు.