ఉయ్యూరు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణ అభివృద్ధికి కృషి చేయాలి : నూతన చైర్మన్, కౌన్సిలర్లకు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ సూచన
ఉయ్యూరు, మేజర్ న్యూస్: ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టణ ప్రజలు భారీ విజయాన్ని అందించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించాయి. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఉయ్యూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్టణ ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి 29 మంది కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని, ప్రజల సంక్షేమం కోసం నీతి, నిజాయితీలతో పనిచేయాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ చేసిన దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకుండా కూటమి అభ్యర్థులకు ఘనవిజయం అందించారని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి చైర్మన్, కౌన్సిలర్లు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఉయ్యూరు సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించి పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన నూతన కౌన్సిలర్లు, చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.