ఉద్యానవన పంటలతో పాటు ఆధారిత ఉత్పత్తులపై రైతుల దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, పంటల నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పంటలకు అదనపు విలువ కల్పించి, రైతులు మరింత మెరుగైన ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు.బుధవారం మండలం లోని శాంతినగరం గ్రామంలోని ఆర్.కె. నేచర్ ఫార్మ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను, ఉద్యాన శాఖ ద్వారా రైతులు ఆర్. లక్ష్మీ శ్రావణి, ఆర్. నాగపద్మలతలకు సబ్సిడీపై అందించిన సోలార్ కోల్డ్ రూమ్, సోలార్ డ్రైయర్ యూనిట్లను పరిశీలించారు. డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు ఇతర పండ్లను నిల్వ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సోలార్ కోల్డ్ రూమ్ పనితీరును, పండ్లు, కూరగాయలను ఎండబెట్టి విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసేందుకు ఉపయోగించే సోలార్ డ్రైయర్ల వినియోగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ పరికరాల ద్వారా రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను సంబంధిత రైతులను అడిగి తెలుసుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం, పంట నిర్వహణ, సాగు ఖర్చులు, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై వివరాలను కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం, అవసరమైన ప్రాసెసింగ్ చేయడం ద్వారా మార్కెట్‌లో మెరుగైన ధరలు పొందే అవకాశాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులందరూ తమ వ్యవసాయ క్షేత్రాల్లో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలను కేవలం పంట ఉత్పత్తులుగానే విక్రయించకుండా, వాటిని నిల్వ చేసి, విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేసి, సరైన మార్కెటింగ్, బ్రాండింగ్ ద్వారా అధిక ఆదాయం పొందేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాలు, ఆధునిక పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు పద్ధతులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై అవగాహన పెంపొందించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి యు. నాగరాజు, డివిజన్ ఏడి అగ్రికల్చర్ విజయశేఖర్, ఆళ్లగడ్డ వ్యవసాయ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉద్యాన అధికారి దస్తగిరి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా