ప్రొద్దుటూరలో 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ
భోజనం ఇచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో జరగిన చోరీ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
ప్రొద్దుటూరు క్రైం మేజర్ న్యూస్ : కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఓ పాఠశాల వెనుక నివాసం ఉంటున్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇంట్లో చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాజేంద్రనాథ్ రెడ్డి భార్య ఆదిలక్ష్మి తన వాటర్ ప్లాంట్ వద్ద ఉన్న మామకు భోజనం అందించేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి తమ ఇంట్లో సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో వైఎంఆర్ కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి చోరీ ఘటనపై విచారణ చేపట్టి, దొంగలను గుర్తించి ఆభరణాలను స్వాధీనం చేసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.