కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ చామల
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పాత్రను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్ర ప్రాంతం నుంచి 32 మందికి పైగా ఎంపీలు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాటకు కట్టుబడి యూపీఏ భాగస్వామ్య పక్షాలను ఒప్పించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటులో ఆమె పాత్రను విస్మరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారని, ఆ తర్వాత అదే కుటుంబంలో ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీ పదవులు దక్కాయని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని నిలబెట్టుకోకుండా కేసీఆరే ముఖ్యమంత్రి అయ్యారని, అమెరికా ఉద్యోగాన్ని వదిలి వచ్చిన కేటీఆర్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని, సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి, నెలకు రూ.8 వేల కోట్ల వడ్డీ భారం పడే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో పేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళా శక్తి పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కోటికి పైగా కుటుంబాలకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ నాయకులు కూడా స్వాగతించాలని, అవసరమైతే కేటీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఈ బీమా పథకాన్ని పొందవచ్చని వ్యాఖ్యానించారు. చేర్యాలలో నిర్వహించిన నూతన పెన్షన్ ప్రొసీడింగ్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజకీయ రాద్ధాంతం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న బీఆర్ఎస్ నాయకత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చామల విమర్శించారు. ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు, ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకుని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.