హామీల అమలేది..? రైతుల ఎదురుచూపులెన్నాళ్లు?
హామీల అమలేది..? రైతుల ఎదురుచూపులెన్నాళ్లు?
-రైతుబంధు విడుదల చేయాలి.. పింఛన్లు పెంచాలి
-సిద్దిపేట సభలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి.. లేదంటే పర్యటన అడ్డుకుంటాం
-సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి
సిద్దిపేట రూరల్ :
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక ఎందుకు అమలు చేయడం లేదని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హామీల అమలు కోసం ప్రజలు, రైతులు ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని నిలదీశారు.ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షులు కోడూరి మమతా రాజు, పొన్నాల నాగరాజు లతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సిద్దిపేటకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ వేదికగా రైతుబంధు నిధుల విడుదలతో పాటు పింఛన్ల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే రైతుబంధు నిధులు విడుదల చేయాలని కోరారు.ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు ఎప్పటి నుంచి పెంచుతారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని అన్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి సభకు ఇతర జిల్లాల నుంచి మహిళలను డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సభలు, ప్రసంగాలతో కాలం గడపడం సరికాదన్నారు.సిద్దిపేట సభ కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా హామీల అమలుపై స్పష్టత ఇచ్చే వేదిక కావాలి. రైతుబంధు విడుదల, పింఛన్ల పెంపుపై ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రకటన చేయకపోతే సర్పంచుల ఫోరం తరఫున ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బట్టు భాస్కర్ రెడ్డి హెచ్చరించారు.
(సిద్దిపేట రూరల్, రమేష్)