కలమట మద్దతుతో రాజారావు మాస్టారు నామినేషన్ కు భారీ జన సముద్రం.
పాతపట్నం మేజర్ న్యూస్:
పాతపట్నం మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అభ్యర్థుల ప్రచార హోరులో భాగంగా సర్పంచ్ అభ్యర్థి నల్లి రాజారావు బుధవారం భారీ జనసందోహం మధ్య తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఉదయం 11:15 గంటలకు నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతాపురం నుంచి ఆల్ ఆంధ్రా రోడ్డు కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. రాజారావు మాస్టారుకు మద్దతుగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పాతపట్నం ప్రధాన రహదారి జనసందోహంతో కిక్కిరిసింది. నినాదాలతో పురవీధులు మార్మోగాయి. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన అభ్యర్థి నల్లి రాజారావుకు తన మద్దతును ప్రకటించారు.
గ్రామాభివృద్ధే నా లక్ష్యం: నల్లి రాజారావు
నామినేషన్ దాఖలు అనంతరం నల్లి రాజారావు మాస్టారు మాట్లాడుతూ.. పాతపట్నం గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు, అవసరాలు ఎదురైనా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అర్ధరాత్రి వేళలోనైనా తన ఇంటి తలుపులు ప్రజల కోసం తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి పాతపట్నాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మద్దతుతో పాటు స్థానిక ప్రజలు చూపిస్తున్న ఆదరణ తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ వార్డులకు చెందిన సభ్యులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నల్లి రాజారావుకు సంఘీభావం తెలిపారు. భారీ ర్యాలీ, జనసమీకరణతో పాతపట్నం పంచాయతీ ఎన్నికల సందడి మరింత పెరిగింది..
సూర్య ప్రతినిధి ,పాతపట్నం.