ఖేలో ఇండియా వేదికపై కరీంనగర్ క్రీడా వైభవం
సూర్య కరీంనగర్: జాతీయ క్రీడా పటంలో కరీంనగర్ తనదైన ముద్ర వేయడానికి మరో ప్రతిష్టాత్మక అవకాశం దక్కింది. దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో భాగంగా జాతీయస్థాయి జూడో పోటీల నిర్వహణకు కరీంనగర్ ఆతిథ్యమివ్వనుంది. ఈ అవకాశాన్ని కేవలం పోటీల నిర్వహణకే పరిమితం చేయకుండా.. క్రీడా స్ఫూర్తిని చాటుతూ, దేశం దృష్టిని ఆకర్షించేలా వేడుకగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, నిర్వహణలో కరీంనగర్ దేశానికే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఎనిమిది ఆతిథ్య జిల్లాల్లో 20 వేదికలపై జరగనున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం జాతీయస్థాయి జూడో పోటీలకు వేదిక కానుంది. డిసెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు పోటీలు జరగనుండగా, డిసెంబర్ 15 నుంచే క్రీడాకారులు, ఇతర బృందాల రాక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
**ఏర్పాట్లలో ఎక్కడా రాజీ వద్దు**
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయస్థాయి పోటీలకు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఆతిథ్యంలో ఎలాంటి లోటు కనిపించకూడదని స్పష్టం చేశారు. వసతి, భోజనం, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, భద్రత వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వహిస్తూ పోటీలను పండుగ వాతావరణంలో విజయవంతం చేయాలని ఆదేశించారు.
**386 మంది బృందానికి ఏడు రోజుల ఆతిథ్యం**
డిసెంబర్ 15 నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు ప్రతిరోజూ 386 మంది బృంద సభ్యులకు అవసరమైన వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. వీరిలో 256 మంది క్రీడాకారులు, 77 మంది సహాయక సిబ్బంది, 30 మంది సాంకేతిక అధికారులు, ఒక పోటీల నిర్వహణ మేనేజర్, 10 మంది వీఐపీలు, 12 మంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు ఉంటారు. పోటీలు జరిగే రోజుల్లో అదనంగా మరో 10 మంది ప్రత్యేక స్వచ్ఛంద సేవకులు సేవలందించనున్నారు. ఇంత పెద్ద బృందానికి నాణ్యమైన వసతి, భోజనం అందించడంతో పాటు రవాణా, వైద్య సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
**దేశం దృష్టిని ఆకర్షించేలా కరీంనగర్**
ఖేలో ఇండియా పోటీలు క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలవడమే కాకుండా ఆతిథ్య జిల్లాకు గుర్తింపు తెచ్చే అవకాశమని కలెక్టర్ పేర్కొన్నారు. పోటీల నిర్వహణలో కరీంనగర్ తెలంగాణలోనే కాకుండా దేశస్థాయిలో ఆదర్శంగా నిలవాలన్నారు. అంబేద్కర్ ఇండోర్ స్టేడియాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చాలని, క్రీడాకారులకు అనువైన వాతావరణం కల్పించాలని సూచించారు. పోటీలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
**లోగో, మస్కట్‌తో ప్రచారానికి శ్రీకారం**
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అధికారిక లోగో, మస్కట్‌ను కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. ఈ నెల 15న న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక లోగో, మస్కట్‌ను ఆవిష్కరించిన నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కరీంనగర్‌లోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
**పాఠశాలల నుంచి ప్రధాన కూడళ్ల వరకు ప్రచారం**
ఖేలో ఇండియా జూడో పోటీల నిర్వహణపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రచార కార్యాచరణ చేపట్టనుంది. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాలు, పోటీలు జరిగే వేదికల వద్ద అధికారిక లోగో, మస్కట్‌తో ప్రచార సామగ్రిని ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన ప్రాంతాల్లో మస్కట్ సెల్ఫీ పాయింట్లు, కటౌట్లు, స్టాండీలు, హోర్డింగులు, ఎల్ఈడీ తెరల ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. పోటీల వేదిక వద్ద కౌంట్‌డౌన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వీలున్న ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులపై ప్రచారానికి చర్యలు చేపట్టనున్నారు.
పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలల్లో ఖేలో తెలంగాణ గ్లోబల్ క్విజ్‌పై విస్తృత అవగాహన కల్పించనున్నారు. విద్యార్థులకు మస్కట్, 'ఖేలో ఇండియా' ఇతివృత్తంతో చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు. యువత, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, యువజన సంఘాలు, క్రీడా సంఘాల భాగస్వామ్యంతో ఖేలో ఇండియా రన్, వాకథాన్, సైక్లోథాన్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రజల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా గోడలపై క్రీడా చిత్రాలు, సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం కొనసాగించనున్నారు.
**క్రీడా స్ఫూర్తికి కరీంనగర్ చిరునామా కావాలి**
జాతీయస్థాయి క్రీడాకారులకు ఆతిథ్యమివ్వడం కరీంనగర్‌కు గర్వకారణమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ప్రతిష్టను మరింత పెంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. పోటీల నిర్వహణతో పాటు జిల్లాలోని విద్యార్థులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి ఖేలో ఇండియా జూడో పోటీలను విజయవంతం చేయాలని ఆదేశించారు.