సిద్దిపేటకు పట్టిన చీడ, పీడ హరీష్ రావుః టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టుసాయి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే భూ బకాసుర రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. సిద్దిపేటకు హరీష్ రావు చీడ, పీడగా మారారని, త్వరలోనే ప్రజలు ఆయనకు రాజకీయంగా తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్లో మాట్లాడిన మెట్టుసాయి.. సుమారు 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న హరీష్ రావు సిద్దిపేట ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. సిద్దిపేటను రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మార్చుకున్నారని ఆరోపించారు. హరీష్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్ రామిరెడ్డి కలిసి సిద్దిపేట ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. సిద్దిపేటలో నిరుపేద కుటుంబాలకు పెన్షన్లు అందకుండా అడ్డుకుంటున్నారని, రైతుల భూములను లాక్కున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మల్లన్నసాగర్ భూనిర్వాసిత రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురిచేసిన ఘటనలను ప్రజలు మరిచిపోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తే గతంలో జరిగిన అక్రమాలు, భూ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మెట్టుసాయి ఆరోపించారు. సిద్దిపేట ప్రజలు హరీష్ రావును ఓడించి రాజకీయంగా బుద్ధి చెబుతారని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. 1983లో అనంతుల మదన్ మోహన్ రావు తర్వాత మళ్లీ సిద్దిపేటలో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని పేర్కొన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో కారు, కమలం పార్టీలు కొట్టుకుపోతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ సంఖ్యలో సీట్లు సాధిస్తుందని పేర్కొంటూ, 153 సీట్లున్నా 177 సీట్లు, 199 సీట్లున్నా 100 సీట్లు గెలుస్తామని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని, హరీష్ రావుకు ప్రజలే రాజకీయంగా సమాధానం చెబుతారని మెట్టుసాయి స్పష్టం చేశారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.