విద్యార్థుల సంక్షేమానికి పెద్ద పీట - మంత్రి పొంగులేటి.
విద్యార్థుల కోసం రూ. 2 లక్షలతో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు
విద్య, క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత
కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ప్రారంభించిన మంత్రి
కల్లూరు సూర్య మేజర్ న్యూస్.....
(కిరణ్ కుమార్ ఆరిక)
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ...పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో ఇదే ట్రస్ట్ ద్వారా పాఠశాల విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యతో పాటు క్రీడా రంగాల్లోనూ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ, ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో రూ.25 కోట్ల వ్యయంతో టాటా సంస్థ భాగస్వామ్యంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. విద్యార్థులు చదువు, క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సూచించారు.సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ..విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు చేసినందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని, తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని, తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు.