16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా ? బీసీ నేత, ఎంపీ ఆర్.కృష్ణయ్య
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధి: ఫీజు బకాయిలపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడం సరికాదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సర్టిఫికెట్లు లేక ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్న ఆరు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు. '16 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు రూ.8 వేల కోట్లు వెంటనే చెల్లించాలి.. మా ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఇప్పించండి ముఖ్యమంత్రి గారూ.. ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలి?' అంటూ నినాదాలు చేస్తూ బుధవారం అబిడ్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యా భవిష్యత్తును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్బంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ కోర్సులు పూర్తి చేసి పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీంతో దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు లేక ఉన్నత విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. పీజీ, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందినవారు సర్టిఫికెట్లు సమర్పించలేక అడ్మిషన్లు కోల్పోతున్నారని, ఉద్యోగాలు వచ్చినవారు సైతం అవసరమైన ధ్రువపత్రాలు అందక అవకాశాలను వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యకు సీట్లు సాధించిన విద్యార్థులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు ఇవ్వకుండా, కోర్సులు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు నిలిపివేస్తూ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు అప్పులు చేసి ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు.
బడ్జెట్ ప్రకటించి.. నిధులు విడుదల చేయరా?
ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు బడ్జెట్ కేటాయిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. బడ్జెట్ విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే రాజకీయ కార్యక్రమాలు, ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? విద్యార్థుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఫీజుల బకాయిలు విడుదలైతే కళాశాల యాజమాన్యాలే వాటిని స్వీకరిస్తాయని, విద్యార్థులకు నేరుగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్న వాదన సరికాదన్నారు. ఫీజులు మంజూరైన వెంటనే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. రైతుబంధు పథకం కింద రైతులకు నిధులు జమ అయినట్లు విద్యార్థులకు కూడా వారి ఫీజులు, స్కాలర్‌షిప్‌లు మంజూరైన వివరాలు తెలియజేయాలని కోరారు.
ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నవారు 30 నుంచి 40 శాతం మాత్రమేనని, మిగిలిన 60 నుంచి 70 శాతం మంది సర్టిఫికెట్లు ఇంకా కళాశాలల్లోనే ఉన్నాయని కృష్ణయ్య వివరించారు. అందువల్ల బకాయిలు విడుదల చేయడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లోనూ అదే పరిస్థితి
ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కళాశాలలతో పాటు నిజాం కళాశాల, కోఠి మెడికల్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ కళాశాలలు, మహిళా విశ్వవిద్యాలయాల్లోనూ ఫీజుల సమస్యతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వ, యూనివర్సిటీ కళాశాలల్లో కూడా ఫీజులు చెల్లించేవరకు అడ్మిషన్లు ఇవ్వడం లేదని, రెండో సంవత్సరం ప్రవేశాల విషయంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఫీజుల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని ప్రభుత్వ ఉత్తర్వులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేయడం అన్యాయమని అన్నారు.
విద్యార్థుల విద్య కోసం పెట్టిన పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలు పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించామని కృష్ణయ్య తెలిపారు. ఫీజులు చెల్లించే ఆర్థిక స్థోమత లేని కుటుంబాల పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశతో ఈ పథకంపై ఆధారపడి కోర్సుల్లో చేరుతున్నారని చెప్పారు. ఈ పథకం వల్ల సమాజంలో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఇది ప్రభుత్వానికి భారంగా కాకుండా సమాజ భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలని సూచించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 34 నెలల్లో పన్నులు, భూముల విక్రయాలు, కేంద్ర గ్రాంట్ల ద్వారా సుమారు రూ.7 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి మరో రూ.4 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం సుమారు రూ.11 లక్షల కోట్ల ఆదాయం, నిధుల సమీకరణ జరిగినప్పుడు విద్యార్థుల ఫీజులు, స్కాలర్‌షిప్‌ల కోసం రూ.8 వేల కోట్లు విడుదల చేయలేరా? అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం విద్యార్థుల విద్యకు మాత్రం నిధులు కేటాయించకపోవడం ఏమిటని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలి. విద్యార్థుల విద్యా హక్కును కాపాడాలని, ఫీజుల బకాయిల సమస్యను తక్షణమే పరిష్కరించి సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో నీలా వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, శివకుమార్ యాదవ్, మోదీ రాందేవ్, భీమా రాజు, నిఖిల్ పటేల్, నరేష్ గౌడ్, అల్లం యాదవ్, బాలయ్య, వంశీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.