తోటలోనే పురుడు పోసిన.. 108 సిబ్బంది..... తల్లి బిడ్డ క్షేమం
సైదాపురం మండలం మేజర్ న్యూస్ : సైదాపురం మండలం చాగణం రాజుపాలెం పరిధిలోని ఓ తోటలో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బంది సకాలంలో స్పందించి తోటలోనే సురక్షితంగా ప్రసవం చేశారు. అనంతరం తల్లి, శిశువును సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చాగణం రాజుపాలెం ఓ తోటలో ఎస్. చెంచయ్య, ఆయన భార్య ఎస్. సుమతి తోటలో పనిచేసుకుంటూ అక్కడే నివసిస్తున్నారు. ఈ క్రమంలో సుమతికి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో తోట యజమాని తెలుసుకొని వెంటనే 108కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని . పురిటి నొప్పులతో బాధపడుతున్న సుమతికి అత్యవసర వైద్య సిబ్బంది సలహాలతో 108 సిబ్బంది ప్రాథమిక వైద్యం అందిస్తూ సురక్షితంగా ప్రసవం చేశారు. దీంతో సుమతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డను సైదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సురక్షితంగా తరలించినట్టు ఈఎంటీ బాబురావు, పైలెట్ బి.వి. రమణయ్య తెలిపారు. అత్యవసర సమయంలో సమాచారం అందుకున్న వెంటనే స్పందించి, తోటలోనే గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేయించి తల్లి, బిడ్డను ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది సేవలను మండల ప్రజలు అభినందించారు.