టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్
సీతానగరం, నవంబర్27 మేజర్ న్యూస్ : పొగాకు రహిత సమాజ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని, ముఖ్యంగా యువతే కీలకమని జిల్లా అసంక్రమిత వ్యాదుల నియంత్రణ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు అన్నారు. టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ 4.O లో బాగంగా మరిపివలస, పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ జగన్ మోహన్ వైద్య బృందంతో కలిసి పాల్గొని కార్యక్రమ ఉద్దేశ్యం,లక్ష్యం పై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పొగాకు ఉత్పత్తులు సిగరెట్, చుట్ట, ఖైనీ, గుట్కా, తంబాకు తదితర వ్యసనాలతో ఆరోగ్యం పై తీవ్రమైన ప్రభావం పడుతుందని, శరీరంలో ముఖ్యమైన అవయవాల పనితీరు క్షీణిస్తుందన్నారు. క్యాన్సర్ కారకాల్లో ప్రధానమైనది పొగాకు అని , అలాగే ఊపిరితిత్తులు, దృష్టి సమస్యలు, పక్షవాతం , పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం తదితర సమస్యలకు దారి తీస్తుందన్నారు. యువత వీటికి బానిస కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. శాఖల సమన్వయంతో వీటిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కోట్పా యాక్ట్ ప్రకారం విద్యాసంస్థల ప్రాంగణంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషిద్ధమని, ఇందుకు సంబంధించి టోఫీ ప్రోగ్రాం ను వైద్య సిబ్బంది అన్ని స్కూల్స్ లో డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సి.హెచ్. ధర్మతేజ, ఎన్.టి.సి.పి కౌన్సిలర్ భవాని, డి.ఎం.హెచ్.పి కౌన్సిలర్ కృష్ణారావు, వైద్య సిబ్బంది సుశీల, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.