తణుకులో క్రీడా సందడి.. ఘనంగా ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఎస్‌కేఎస్‌డీ విద్యాసంస్థలు విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీల అందజేత
తణుకు, సూర్య న్యూస్ : క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా, యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా తణుకు పట్టణంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. ఎస్‌కేఎస్‌డీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన యోనెక్స్ సన్‌రైజ్ శ్రీ చిట్టూరి సుబ్బారావు స్మారక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి అండర్–17 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి.రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ క్రీడాకారులు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. గెలుపోటములకు అతీతంగా క్రీడాస్ఫూర్తిని చాటుతూ సాగిన ఈ పోటీలు భావి బ్యాడ్మింటన్ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చాయి.
పోటీల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి మంతెన మురళీకృష్ణ, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు కంటిపూడి రాంబాబు పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు. అఫీషియల్ క్లబ్ తరఫున రూ.10 వేల నగదు బహుమతిని ప్రదానం చేశారు.
ఎస్‌కేఎస్‌డీ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి, టోర్నమెంట్ కమిటీ చైర్మన్ చిట్టూరి వెంకట కృష్ణారావు పోటీల నిర్వహణను పర్యవేక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఆతిథ్యమివ్వడం ద్వారా తణుకు పట్టణానికి క్రీడారంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఎస్‌కేఎస్‌డీ విద్యాసంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ రిఫరీలు, క్రీడా అధికారులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు
.రిపోర్టర్.అనుకుమార్. తణుకు. .పశ్చిమగోదావరి జిల్లా. .