తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా....!
తగరపువలస, సూర్య : స్థానిక తగరపువలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. శ్రీవాణి గారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. మౌలానా అసలు పేరు "మొహియుద్దీన్ అహ్మద్" అని, అబుల్ కలాం అనేది బిరుదు అని, 'ఆజాద్' కలం పేరని తెలిపారు. ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడని, ఐఐటీ స్థాపనలో, ఉన్నత సాంకేతిక విద్య అభివృద్ధిలో వీరు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి వాసుదేవ రావు మాట్లాడుతూ ఆజాద్ 'అల్-హిలాల్', 'అల్-బలాగ్' అనే పత్రికలు స్థాపించారని, 'గుబార్-ఎ-ఖాతిర్', 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' వంటి రచనలు చేశారని తెలిపారు. భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి 1992లో భారతరత్న అవార్డును ప్రకటించిందని, మన భారతదేశం 1954లో 18% అక్షరాస్యత నుంచి నేడు 80% పైచిలుకు అక్షరాస్యత వృద్ధి సాధించుటలో ఆజాద్ ప్రారంభించిన సంస్కరణల కృషి మరువలేనిదని కీర్తించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ స్వర్ణలత, ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్ రావు, తెలుగు శాఖాధిపతి డాక్టర్ రేచర్ల శ్రీలక్ష్మి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.