స్వచ్ఛ తిరుపతి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి ఎమ్మెల్యే ఆరణి -ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలి : కమిషనర్ జయకృష్ణ
స్వచ్ఛత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆరణి పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా-2026 కార్యక్రమంలో భాగంగా గురువారం వినాయక సాగర్ వద్ద భారీ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. "ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్" నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే,కమిషనర్, స్థానిక నాయకులు, నగరపాలక సిబ్బంది తో కలిసి వినాయక సాగర్ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. నగరాన్ని స్వచ్ఛ తిరుపతిగా, సుందర తిరుపతిగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇది కేవలం మున్సిపల్ సిబ్బంది బాధ్యత కాదు, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి అని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17వరకు నగరంలోని 50 డివిజన్లలో శ్రమదాన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలందరూ తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, రోడ్లపై చెత్త వేయకూడదు. తిరుపతిని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, ఎస్వి బిసి చైర్మన్ శ్రీధర్ వర్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జేబీ శ్రీనివాసులు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్ర కోటి సదాశివం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.