రాజ్యాంగ విలువలే గాంధీజీ ఆశయాలకు నిదర్శనం
డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్ తిప్పా రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బిజయ కుమార్ బెహరా, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఛైర్మన్ తిప్పారెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సత్యం, అహింస, నైతికత, సామాజిక సమానత్వం వంటి సిద్ధాంతాలు న్యాయవ్యవస్థకు, న్యాయవృత్తికి మార్గదర్శక సూత్రాలని పేర్కొన్నారు. న్యాయ విద్యార్థులు కేవలం చట్టాలను అధ్యయనం చేయడమే కాకుండా న్యాయసూత్రాలను ఆచరణలో పాటిస్తూ సమాజంలో న్యాయం, ధర్మం, మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపరిచిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలు గాంధీజీ బోధించిన మానవతా విలువలకు అనుగుణంగా సమాజ నిర్మాణానికి దోహదపడతాయని వివరించారు.విద్యార్థులు సత్యం, అహింస, రాజ్యాంగ విలువలను పాటిస్తూ బాధ్యతాయుత న్యాయ నిపుణులుగా ఎదుగుతామని ప్రతిజ్ఞ చేశారు.
సీఎం గౌడ్ సూర్య ప్రతినిధి