పెంచలకోన స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి
నెల్లూరు కల్చరల్ రాపూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో కొలువైన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి శుక్రవారం ఉదయం తిరుప్పావడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉదయం ఈ సేవను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.ఈ అన్నకూటోత్సవం ప్రతి శుక్రవారం స్వామివారికి ఆలయంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. భక్తులు రూ. 500 చెల్లించి ఈ ఆర్జిత సేవలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చన చేసి, తీర్థప్రసాదాలతో పాటు ఒక కేజీ పులిహోరను అందజేస్తామని వెల్లడించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత శుక్రవారం కుటుంబ సమేతంగా శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి ఆలయ మర్యాదలతో ప్రధానార్చకులు, వేదపండితులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక దర్శనానంతరం పండితులు వారికి వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.ఈ కార్యక్రమాలను ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి జనార్ధన రెడ్డి పర్యవేక్షించారు.