స్థానిక పత్రికలపై వివక్ష తగదు
సీతమ్మధార, సూర్య : స్థానిక పత్రికలపై వివక్ష తగదని వాటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సిఐఐ సమ్మిట్ వార్తా సేకరణ కొరకు స్థానిక పత్రికలను పాసులు జారీ చేయాలని కోరారు. గతంలో అన్ని అధికారిక కార్యక్రమాలకు మంజూరు చేసే వారనీ, గత కొంతకాలంగా నిలుపుదల చేశారని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం లోనూ,
ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల కవరేజ్ పాసులు కూడా ఇవ్వలేదని తెలిపారు. స్థానిక పత్రికలకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా ప్రెస్ అక్రిడేషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉంచారని పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డిఎంఏసీ సమావేశంలో అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జీవోలో పేర్కొన్నప్పటికీ సమావేశం జరిగి 7నెలలైనా ఇప్పటివరకు స్పందన లేదన్నారు . దీనిపై డిఆర్ఓ స్పందిస్తూ కలెక్టర్ దృష్టిలో సమస్యను ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం సమస్యను డిప్యూటీ డైరెక్టర్ కె.సదారావు దృష్టికి తీసుకుని వెళ్ళగా స్థానిక పత్రికలు ఎక్కువ కావటం వల్ల పాసులు జారీ చేయలేకపోతున్నామని, ఇకపై జరిగే కార్యక్రమాలకు పదిమంది వరకు పాసులు అందజేస్తామని తెలిపారు. దానిపై అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ నామ మాత్రంగా కాకుండా తగినన్ని పాసులు జారీ చేయాలనీ, అది కూడా సిఐఐ సదస్సు నుండే ప్రారంభించాలని కోరారు .ఈ కార్యక్రమంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. సత్యనారాయణ, అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జాతీయ కమిటీ సభ్యుడు మొల్లి కమల్ కుమార్ ,ఎల్ఎన్ఎ ప్రతినిధులు ప్రతినిధులు ఆర్ .అబ్బాస్, కె చక్రవర్తి, పృధ్వీరాజ్, కె శివ, కనకరాజు, సీనియర్ జర్నలిస్టు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.