సిరమ్మ కులంపై కోర్టులో వైసీపీ పిటిషన్.... *ఏకగ్రీవాన్నీ అడ్డుకున్న వైసీపీ*
విజయనగరం బ్యూరో, సూర్య : చిన్నశ్రీను కుమార్తె సిరిసహస్ర అలియాస్ సిరమ్మ కులవివాదం కోర్టుకు చేరింది. ఆమె బీసీ కాదంటూ వైసీపీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తామిచ్చిన ఫిర్యాదును జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ దర్శకత్వంలోనే ఇదంతా జరుగుతున్నట్టు ప్రచారంలో ఉంది. సిరమ్మ జిల్లాలోని రెండు జెడ్పీటీసీలకు నామినేషన్లు దాఖలు చేశారు. తాను బీసీ అంటూ సంబందిత ధ్రువీకరణ పత్రాలను జతచేశారు. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్లను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఆమె బీసీ కాదని, ఓసీ అయిన ఆమెకు బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేయడమేమిటని వైసీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ వాదిస్తున్నారు. ఈమేరకు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై జిల్లా యంత్రాంగం ఏమీ తేల్చడంలేదంటూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, సిరమ్మ నామినేషన్లు దాఖలు చేసిన కొత్తవలస, తెర్లాం లలో ఏదో ఒకదాన్ని, వీలైతే రెండుచోట్లా ఏకగ్రీవం చేసుకునేందుకు చిన్నశ్రీను ప్రయత్నిస్తున్నట్టు భావించిన వైసీపీ నేతలు, ఆ ప్రయత్నాన్నీ అడ్డుకున్నారు. ఓ వైపు ఇది జరుగుతుండగానే సిరిసహస్ర ఎన్నికల ప్రచారంలోకి దూకారు. రెండుచోట్లా స్థానిక నాయకులతో కలసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాగా, సిరిసహస్ర విషయంలో వైసీపీ నేతల వైఖరిపై ఆపార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓసీ అయినప్పుడు, బీసీగా నామినేషన్లను వేయడమేమిటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అలాగే, ఆమెను ఇలా వెంటాడినట్టు వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయం ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. కాగా, దీనివెనుక తాడేపల్లి ప్యాలస్ డైరెక్షన్ ను కొట్టిపారేయలేమని పరిశీలకవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన చిన్నశ్రీనును దెబ్బకొట్టాలనే వ్యూహం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యాయం తనపక్షాన ఉందని ధైర్యంతో కుమార్తెను ఎన్నికల ప్రచారంలోకి ఉరికించారు. మరోవైపు, జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సోమవారం సిరమ్మ కులవివాదంపై స్పందిస్తూ అంతిమంగా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆమె బీసీ అనడానికి బలమైన ఆధారాలతో ఉన్నామని స్పష్టం చేశారు. మొత్తమ్మీద, సిరమ్మ నామినేషన్ వ్యవహారం నేపథ్యంలో జిల్లా రాజకీయం మరింత వేడెక్కుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ విషయంపైనే ఉంది.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.