సింహాద్రి అప్పన్న సన్నిధిలో మేయర్ ముక్కా శ్రావణి
సింహాచలం, సూర్య: విశాఖ నగర మేయర్‌గా ఎన్నికైన డాక్టర్ ముక్కా శ్రావణి తొలిసారిగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం మేయర్ ముక్కా శ్రావణి మాట్లాడుతూ సింహాద్రి అప్పన్న ఆశీస్సులు, కరుణాకటాక్షాలతోనే తనకు మేయర్‌గా విజయం లభించిందని పేర్కొన్నారు. ప్రతి అడుగులోనూ స్వామివారి ఆశీస్సులు తనకు తోడుగా నిలిచాయని తెలిపారు. విశాఖ నగర ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నగర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నగరంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానన్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో విశాఖను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తానని మేయర్ ముక్కా శ్రావణి తెలిపారు.