సేవా కార్యక్రమంతో సత్యసాయి బాబా శతజయంతి వేడుకల ముగింపు
హిరమండలంలో 101 మందికి నూతన దుప్పట్ల పంపిణీ
హిరమండలం, మేజర్ న్యూస్: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకల ముగింపు సందర్భంగా హిరమండలం స్థానిక ప్రేమసాయి వృద్ధాశ్రమంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాస్టారు ముఖ్య అతిథిగా హాజరై, హిరమండలం పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలు, హోటళ్లలో పనిచేస్తున్న కార్మికులు కలిపి 101 మందికి నూతన దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర రామచంద్రరావు మాస్టారు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సత్యసాయి బాబా బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. “అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు” అనే బాబా సందేశంలోనే అన్ని మతాల సారాంశం ఇమిడి ఉందని, సేవాభావంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే నిజమైన మానవత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ సమన్వయకర్త బోయిన నరసింహమూర్తి, జిల్లా బాల వికాస్ రిసోర్స్ పర్సన్ ఎల్. చంద్రశేఖర్ మాస్టారు, జోనల్ కన్వీనర్ చంటి మాస్టారు, ఆశ్రమ కోఆర్డినేటర్ ఎస్. సాయిబాబా, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అందవరం వెంకట బుచ్చబ్బాయి, ఆశ్రమ మేనేజర్ కె. నరసింహమూర్తి, సబ్‌జోన్ కన్వీనర్లు కొంచాడ వెంకటరమణయ్య, కొండపల్లి దివాకర్, హిరమండలం మందిర్ కన్వీనర్ ఊన్న వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.