అక్రమ నిర్మాణాలను నిర్మూలించేది ఎప్పుడు..? నోటీసులు జారీ చేసినా ఆగని ఆక్రమణల పర్వం..!
సర్వే నంబర్ 230/7Bలో యథేచ్ఛగా నిర్మాణాలు..! ప్రభుత్వ నోటీసులకు బేఖాతర్.. వంశధార నిర్వాసితుడు ఎద్దు లక్ష్మీనారాయణ తీవ్ర ఆరోపణ
హిరమండలం,మేజర్ న్యూస్: వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన భూముల్లో అక్రమ ఆక్రమణలు, నిర్మాణాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వంశధార ప్రాజెక్టు కట్టడాల విభాగం పరిధిలోని సర్వే నంబర్ 230/7Bలో ప్రాజెక్టు భూములకు సంబంధించిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే సంబంధిత వ్యక్తులకు 28-01-2025న నోటీసులు జారీ చేసినప్పటికీ, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వంశధార నిర్వాసితుడు ఎద్దు లక్ష్మీనారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ, వంశధార ప్రాజెక్టు కట్టడాల విభాగం నుంచి సంబంధిత వ్యక్తులకు 19-11-2026 తేదీన ఎల్.ఆర్. నంబర్లు 38, 39 ద్వారా మరోసారి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించిన భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు శాఖ గుర్తించి, తగిన చర్యలు తీసుకునే దిశగా నోటీసులు జారీ చేసినప్పటికీ ఆక్రమణదారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా సదరు సర్వే నంబర్‌లో నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఎద్దు లక్ష్మీనారాయణ ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసినా నిర్మాణాలు నిలిచిపోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ప్రభుత్వ నోటీసులకు విలువ లేకుండా పోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడమే కాకుండా, ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను తొలగించే చర్యలు ఎప్పుడు చేపడతారని ఆయన ప్రశ్నించారు. నోటీసులు జారీ చేయడంతోనే అధికారులు తమ బాధ్యత ముగిసినట్లు భావించకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, సర్వే నంబర్ 230/7Bలో జరుగుతున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ అక్రమ నిర్మాణాలను నిర్మూలించాలని సంబంధిత ఉన్నతాధికారులను పత్రికల ద్వారా ఆయన కోరారు.