కోటిపల్లి అభివృద్ధికి కోటి హామీ
నేటి దినపత్రిక సూర్యబ్యూరో రాజమహేంద్రవరంప్రముఖ శైవక్షేత్రమైన కోటిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.సర్పంచ్ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించగా గ్రామంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఓసీ వర్గానికి చెందిన యువకుడు పట్నాల సోమశేఖర్ చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.ఎస్సీ వర్గానికి చెందిన రేవు అమ్మాజీరావు సైతం బరిలో నిలిచారు.మొత్తంగా తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఉన్నప్పటికీ అభ్యర్థులంతా స్వతంత్రులుగానే ప్రచారం చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో పట్నాల సోమశేఖర్ చేసిన ప్రకటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.గ్రామాభివృద్ధికి,తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.తన పొలం విక్రయించి వచ్చే కోటి రూపాయలను గ్రామాభివృద్ధికి అందజేస్తానని ప్రకటించారు.గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి తనను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అన్ని కులాల పెద్దల సమక్షంలో ఆ మొత్తాన్ని అందజేస్తానని స్పష్టం చేశారు.గ్రామ ప్రయోజనాల కోసం ఏకగ్రీవ ఎన్నికకు ముందుకొచ్చిన ఆయన ప్రకటనపై గ్రామంలో ఆసక్తికర చర్చ సాగుతోంది.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బరిలో ఎంతమంది మిగులుతారో వేచి చూడాలి.