సీతానగరం మండల అభివృద్ధికి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురం, సూర్య : సీతానగరం మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. జడ్పీటీసీ అభ్యర్థి కంకణపల్లి అనురాధ తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో స్థానిక సంస్థల ఎన్నికల గెలిపించాలని పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీతానగరం మండలంలోని బూర్జ, కృష్ణరాయపురం, లక్ష్మీపురం, సీతానగరం గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి కంకణాపల్లి అనురాధతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీతానగరం మండలం అభివృద్ధిలో వెనుకబడిందని విమర్శించారు. సీతానగరం వంతెనను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తుచేశారు. మండలంలోని అన్ని గ్రామాలను అనుసంధానించేలా వంతెనలు, రహదారుల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. సీతానగరం మండలాన్ని జిల్లాలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.