సమాజాన్ని సన్మార్గంలోకి తీసుకువెళ్లిన మహర్షి వాల్మీకి ఆదర్శప్రాయులు : బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :భారత సమాజాన్ని సన్మార్గంలోకి తీసుకువెళ్లిన మహర్షి వాల్మీకి ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఏర్పాటుచేసిన మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.
భగవంతుడి పరమార్ధం తెలియపరిచే కావ్యాలను పఠనం చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం చూపిన రామాయణాన్ని పిల్లలకు మంచి కథలుగా చెప్పాలన్నారు. సంస్కృతంలో 24 వేల పద్యాలతో రామాయణాన్ని రాసిన మహనీయులు వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని వివరించారు. విద్య లేని ఆనాటి కాలంలో సంస్కృత భాషలో చక్కని కావ్యాలను ప్రజలకు అందించారన్నారు. దేశ, రాష్ట్ర ఇతిహాసం, మహనీయుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వమే అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒక నెల నుంచి దేశ చరిత్ర, ఆధ్యాత్మిక పరమార్థం తెలిపే కావ్యాలను పఠనం చేస్తున్నానన్నారు.
ఎదుటివారికి హాని కలిగించకుండా మంచి చేయాలన్న దృక్పథం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న చెప్పారు. బోయవాడైన వాల్మీకి జ్ఞానోదయంతో మహర్షిగా మారారన్నారు. సత్యం, ప్రేమ, దైవత్వంపై చక్కని కావ్యాలను రచించి, దేశానికి ఆదర్శప్రాయుడయ్యారన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డి ఆర్ డి ఏ పీడీ బి.సింగయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్.విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.