సైతారుపేటలో సంచలనం... ఏకగ్రీవ సర్పంచ్ గా వీసం వెంకట సాయి లక్ష్మి!
ఎస్.రాయవరం, నవంబర్ 27, మేజర్ న్యూస్: ఏ ఊరికి ఆ ఊరే ఆదర్శంగా నిలవాలంటే అది ఇలాగే ఉంటుంది. సైతారుపేట గ్రామ ప్రజలు చూపిన ఐక్యత నేడు అంతటా చర్చనీయాంశంగా మారింది. మా సర్పంచ్ ఏకగ్రీవం కావాల్సిందే అంటూ గ్రామస్తులంతా కలిసికట్టుగా పట్టుబట్టి, ఎన్నికలు లేకుండానే తమ గ్రామ ప్రథమ పౌరురాలిని ఎన్నుకున్నారు. ఆ అదృష్టవంతురాలే వీసం వెంకట సాయి లక్ష్మి.
నిజంగా సైతారుపేట ప్రజలు అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఊరికి దక్కింది మామూలు సర్పంచ్ కాదు... ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే ఆలోచించే మనస్తత్వం ఉన్న నాయకురాలు.
ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ వీసం వెంకట సాయి లక్ష్మి ని కలిసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో ఆమె, వారి భర్త అప్పలస్వామి నాయుడు తమ ఆవేదనను, ఆశయాన్ని పంచుకున్నారు.
"మా ఊరు శివారు గ్రామం అని అధికారులకు చిన్నచూపు. మాకు తాగునీరు, సాగునీరు రెండూ పెద్ద సమస్యగా మారాయి" అని వారు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
అయితే ఆ అసహనం వెనుకే ఒక సంకల్పం కూడా ఉంది.
"మమ్మల్ని నమ్ముకుని మా ఊరి ప్రజలంతా ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. వారందరికీ న్యాయం చేయకపోతే ఎలా?"
ఏమైనా సరే, తమ గ్రామ ప్రజలు తాగునీటి కోసం, రైతులు సాగునీటి కోసం ఇక ఏమాత్రం ఇబ్బంది పడకుండా తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సర్పంచ్ సాయి లక్ష్మి తమదైన శైలిలో స్పష్టం చేశారు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రజలతోనే కలిసి ప్రయాణం చేసి సాధిస్తామని ప్రకటించారు. పదవి కోసం పోటీ పడని ఊరు... అభివృద్ధి కోసం పట్టుబట్టిన ఊరు... సైతారుపేట!