సహస్ర రిట్ అప్పీల్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
- సింగిల్ జడ్జి ఆదేశాలు విచారణకు ప్రామాణికం కాదు
- కుల ధ్రువీకరణపై స్వతంత్రంగా విచారణ జరపాలి
- రూ.3 వేల అదనపు చెల్లింపు కుల నిర్ధారణకు ఆధారం కాదని స్పష్టీకరణ
విజయనగరం బ్యూరో, సూర్య: విజయనగరం జిల్లా తెర్లాం జెడ్పీటీసీ సభ్యురాలు మజ్జి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సహస్ర దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను సోమవారం విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ పలు కీలక స్పష్టీకరణలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను పరిష్కరిస్తూ (డిస్పోజ్ చేస్తూ) ఉత్తర్వులు ఇచ్చింది. సహస్ర కుల ధ్రువీకరణ పత్రంపై వచ్చిన ఫిర్యాదును విచారించే క్రమంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ప్రమాణంగా లేదా మార్గదర్శకంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. కుల ధ్రువీకరణ పత్రంపై వచ్చిన ఫిర్యాదును సంబంధిత విచారణ, స్క్రూటినీ కమిటీ స్వతంత్రంగా పరిశీలించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు బలమైన, విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలని, చట్టం, నిబంధనల్లో నిర్దేశించిన విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. విచారణను నిబంధనల ప్రకారం దశలవారీగా చేపట్టాలని, చట్టబద్ధమైన విధానానికి విరుద్ధంగా కాలపరిమితి విధించలేమని స్పష్టం చేసింది. మరో కీలక అంశంగా, అదనంగా చెల్లించిన రూ.3 వేల మొత్తాన్ని సహస్ర కుల నిర్ధారణకు రిటర్నింగ్ అధికారి ఆధారంగా పరిగణించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మొత్తం విచారణ తుది ఫలితానికి లోబడి ఉంటుందని పేర్కొంది. సహస్ర తరఫున సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వులు జాయింట్ కలెక్టర్ అధికార పరిధిని ఆక్రమించే విధంగా ఉన్నాయని వాదించారు. మొత్తంగా.. సహస్ర రిట్ అప్పీల్‌ను డివిజన్ బెంచ్ పరిష్కరించినప్పటికీ, ఆమె కుల ధ్రువీకరణ పత్రం వివాదానికి సంబంధించి తుది నిర్ణయం వెలువడలేదు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులతో సంబంధం లేకుండా, సంబంధిత అధికారులు చట్ట ప్రకారం స్వతంత్రంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.