రూపురేఖలు మార్చేలా తుడా మెగా ప్లాన్ -ట్రాఫిక్ ఫ్రీ కారిడార్లు, 100 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్లతో అభివృద్ధి
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) కార్యకలాపాలు ఇక తిరుపతి నగరానికే పరిమితం కావని, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి నాలుగు నియోజకవర్గాల్లో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తుడా ఛైర్మన్ డా.డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. శనివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మార్గదర్శకంలో తిరుపతి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్ గా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
రోజూ లక్షన్నర మంది యాత్రికులు
ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నగరానికి రోజూ లక్షన్నర మంది యాత్రికులు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధునాతన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నగరానికి నాలుగు వైపులా అనుసంధానం చేస్తూ 19 కిలోమీటర్ల మేర 200 కోట్లతో 8 ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. శెట్టిపల్లిలో 80, 100 అడుగుల రోడ్లతో లేఅవుట్ 3 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. తిరుచానూరులో రోజుకు 40-50 వేల భక్తుల రద్దీ దృష్ట్యా టిటిడి నిధులు 90 కోట్లతో 2.5 కి.మీ రోడ్లు, ప్రత్యేక పార్కింగ్, అన్నదాన ప్రదేశాలు, ట్రాఫిక్ కారిడార్ నిర్మిస్తున్నామన్నారు. మదనపల్లె-తిరుపతి, తిరుపతి-బెంగళూరు హైవేలను కలుపుతూ కల్యాణి డ్యామ్ నుంచి రంగంపేట, కొటాల, ఐతేపల్లి మీదుగా 6.8 కి.మీ 100 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. పేరూరు చెరువు నుంచి తుమ్మలగుంట మీదుగా అవిలాల ట్యాంకుకు 30 కోట్లతో నిరంతర నీటి సరఫరా పనులు జరుగుతున్నాయన్నారు. నత్తనడకన ఉన్న తుడా టవర్స్ నిర్మాణం తుది దశకు చేరిందని, 2-3 నెలల్లో అంతర్జాతీయ బ్రాండ్లతో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం కొండపైనే కాక తిరుపతి నగరం మొత్తం పండుగ వాతావరణం కనిపించాలని సీఎం ఆదేశించారని, వ్యాపారులు, హోటల్ యజమానులు విద్యుత్ దీపాలతో అలంకరించి యాత్రికులకు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చేరిన నాని
ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో తుడా వద్ద 450 కోట్లు ఉన్నా ఒక్క పనీ చేయలేదని, నేడు నిధుల కొరత ఉన్నా చైర్మన్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతున్నాయని అన్నారు.2018లో టీడీపీ హయాంలో ప్రణాళిక వేసిన ఐతేపల్లి-రంగంపేట రోడ్డును గత ప్రభుత్వం పక్కన పెట్టిందని, ఇప్పుడు మొదటి విడత 49 కోట్లు, రెండో విడత 46 కోట్లతో టెండర్లు పూర్తి చేసి 100 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఈ రోడ్ల వల్ల స్థానిక రైతుల భూముల విలువ పెరుగుతుందన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కూటమి ప్రభుత్వానికే సాధ్యమని, గత ప్రభుత్వం 24% కి తగ్గించి ద్రోహం చేసిందని విమర్శించారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి