రీవైరింగ్ గ్లోబల్ ట్రేడ్,సప్లై చైన్, మారిటైమ్ కారిడార్స్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధిలో ఎపి ముందంజ
విశాఖపట్నం, మేజర్‌న్యూస్ :
అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య అడ్డంకులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థను పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.
అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో భాగంగా "రివైరింగ్ గ్లోబల్ ట్రేడ్: సప్లై చైన్స్, మారిటైమ్ కారిడార్స్, లాజిస్టిక్స్ అండ్ ఎకనామిక్ రెసిలియన్స్" అనే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చాగోష్టిలో ఆయన ప్యానలిస్టుగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలను, సాధించిన ప్రగతిని ఆయన వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 970 కి.మీలు పైగా తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని పోర్టులు, పరిశ్రమలు,లాజిస్టిక్స్, పట్టణాభివృద్ధి,ఇంధన రంగాలను అనుసంధానిస్తూ ఒక సమగ్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 6 పోర్టులు కార్యకలాపాలు సాగిస్తుండగా, మరో 4 కొత్త గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు నిర్మాణంలో ఉన్నాయని, వీటిలో 3 పోర్టులు రాబోయే ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తద్వారా ఆంధ్రప్రదేశ్ ఒక వికేంద్రీకృత సముద్ర ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తోందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల దూరదృష్టికి అనుగుణంగా లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు చేపట్టామన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల దార్శనికతకు అనుగుణంగా 2030 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ 20 పోర్టుల్లో ఒకటిగా ఏపీ పోర్టులు నిలవాలనే దిశగా పోర్టుల అభివృద్ధికి ప్రత్యేక కృషి జరుగుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం నుండి జరిగే మొత్తం సరుకు రవాణాలో 20 శాతం ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుండే జరిగేలా లక్ష్యంగా పెట్టుకున్నామని శశిధర్ అన్నారు.
కోస్టల్ ఎకనామిక్ కారిడార్ల ఏర్పాటు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ మారిటైమ్ వాణిజ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా తయారీదారులకు లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించి ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.అంతేగాక దుగ్గరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ రానుందని తెలిపారు.
దేశంలో జరిగే ఆక్వా ఎగుమతుల్లో 40 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే జరుగు తున్నాయని శశిధర్ పేర్కొన్నారు.రానున్న రోజుల్లో అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపి నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సెషన్ కు మోడరేటర్ గా వ్యవహరించిన సన్మార్ మ్యాట్రిక్స్ మెటల్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ నారాయణ్ సేతురామన్ మాట్లాడుతూ...
ప్రపంచ వాణిజ్యంలో 80 శాతానికి పైగా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని పశ్చిమాసియా సంక్షోభం వంటి పరిస్థితుల వల్ల సముద్ర రవాణాలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పటిష్టమైన మౌలిక సదుపాయాల అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ సాగరమాల ప్రాజెక్టుల వల్ల దేశంలోని ప్రధాన పోర్టుల సామర్థ్యం రెట్టింపు అయిందని అన్నారు.
డా.టిమో బెహర్ ఫౌండర్ అండ్ సీఈఓ ఎవాల్వ్ లిమిటెడ్ (యూరప్) మాట్లాడుతూ....
ప్రస్తుత ప్రపంచ వాణిజ్య మార్పులు తాత్కాలికమైనవి కావని భౌగోళిక రాజకీయ అంశాలు సప్లై చైన్‌ను శాశ్వతంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో భారత్,యూఏఈ, మెక్సికో వంటి 'కనెక్టర్ ఎకానమీ' దేశాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత పెరుగుతోందని అన్నారు. పారదర్శకత మరియు విశ్వసనీయత ఆధారంగానే భవిష్యత్ వాణిజ్య భాగస్వామ్యాలు కొనసాగుతాయని విశ్లేషించారు.
ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ షిప్కే చీఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సీనియర్ రీసెర్చ్ ఫెలో ఈస్ట్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్,(సింగపూర్) మాట్లాడుతూ...
బహుళజాతి సంస్థలు కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునే 'రీజనల్ స్ట్రాటజీ' వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. భౌగోళిక రాజకీయ ఆంక్షలను అధిగమించేందుకు కంపెనీలు తమ కార్యకలాపాలను వికేంద్రీకరిస్తున్నాయని, ఈ క్రమంలో ఆగ్నేయాసియా, భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై దృష్టి సారిస్తున్నాయని వివరించారు.
బాబీ మోహన్ (చీఫ్ కమర్షియల్ ఆఫీసర్,టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్) మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అడ్డంకులు ఎదురవు తున్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యం 3.9 శాతం వృద్ధి చెందుతోందని వివరించారు. కంపెనీలు తమ సప్లై చైన్‌లో ఎదురయ్యే నష్టాలను ముందుగానే అంచనా వేయడానికి ఏఐ (AI) కంట్రోల్ టవర్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చు కోవాలని సూచించారు.
హెచ్.ఇ. జూలియో ఒరోజ్కో (విదేశాంగ శాఖ ఉప మంత్రి, గ్వాటెమాలా రిపబ్లిక్ ) మాట్లాడుతూ...
అంతర్జాతీయ వాణిజ్యం కొత్త యుగంలోకి ప్రవేశించిందని పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య ఉన్న గ్వాటెమాలా లాజిస్టిక్స్ హబ్‌గా ఎదుగుతోందని తెలిపారు. భారత్ మరియు గ్వాటెమాలా మధ్య 55 ఏళ్ల దౌత్య సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తూ ఆసియా మరియు అమెరికా ఖండాల మధ్య సప్లై చైన్ అనుసంధానానికి భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామని పేర్కొన్నారు.