రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి
అనంతపురం బ్యూరో : రబీ సీజన్‌లో శింగనమల నియోజకవర్గ రైతులకు శనగల పంపిణీలో ఎలాంటి జాప్యం, అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నియోజకవర్గ కో-కన్వీనర్ కుందూ శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యేకు వినతి చేశారు. పుట్లూరు, యల్లనూరు, నార్పల, బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లో రైతులకు సకాలంలో శనగలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రైతులను బారులలో నిలబెట్టకుండా ఒక వారం టోకెన్లు ఇచ్చి, తదుపరి వారం శనగలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంపిణీలో పారదర్శకత పాటించాలని, అధికారులు నిర్లక్ష్యం వహించినా, రైతులను ఇబ్బందులకు గురిచేసినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముల వెంకట సుబ్బయ్య, లోమాడా రాము తదితరులు పాల్గొన్నారు.