రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గన్నవరం కళాశాల విద్యార్థిని
గన్నవరం, సెప్టెంబరు 30, మేజర్ న్యూస్.
రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్–19 రగ్బీ ఛాంపియన్‌షిప్ పోటీలకు గన్నవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న చింతల స్వప్నకుమారి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ అవుతు సునీల తెలిపారు.
ప్రసాదంపాడులో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు స్వప్నకుమారి హాజరై, రగ్బీ క్రీడలో తన ప్రతిభను ప్రదర్శించింది. ఆమె అసమాన నైపుణ్యాన్ని గుర్తించిన ఎంపిక కమిటీ రాష్ట్ర స్థాయి పోటీలకు స్వప్నకుమారిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన స్వప్నకుమారిని ప్రిన్సిపాల్ అవుతు సునీలతో పాటు అధ్యాపకులు సుధాకర్, సుబ్రహ్మణ్యం అభినందించారు. క్రీడాకారిణిని ప్రోత్సహించి, జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనేలా ప్రోత్సహించిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు, షేక్ మీరా సాహెబ్‌లను వారు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ స్వప్నకుమారి ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.