పేరెంట్స్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో దాడి ఆరోపణలు
అనంతపురం బ్యూరో :అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వరకూటి దేవి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా మరొకరు ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వరకూటి దేవి భర్త, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి వరకూటి కాటమయ్యపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. కట్టెలు, చేతులతో దాడి చేసి దుర్భాషలాడినట్లు పేర్కొన్నాయి.
దాడిలో గాయపడిన కాటమయ్యను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించినట్లు తెలిపారు.
సంఘటన సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆసుపత్రికి చేరుకుని కాటమయ్యను పరామర్శించారు. ఘటనపై పూర్తి వివరాలు, పోలీసుల చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది.