పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత: వైఎస్ ప్రమీల వాహనంపై దాడి, పలు చోట్ల ఓటర్ల ఆందోళన
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల 21వ వార్డు పోలింగ్ కేంద్ర పరిశీలనకు వెళ్తుండగా, టీడీపీ శ్రేణులు ఆమెను అడ్డుకుని దాడికి పాల్పడ్డాయని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. 11, 12వ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని రాళ్ల దాడికి దారితీసింది.
మరోవైపు 1, 2, 8, 9, 10 వార్డులలో తమను ఓటు వేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని స్థానిక మహిళలు, ఓటర్లు ఆందోళనకు దిగారు. మరికొన్ని చోట్ల ఓటర్ స్లిప్పులను బలవంతంగా లాక్కుంటున్నారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవ్వడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.