ప్రజాసేవే లక్ష్యంగా.. హనుమంతునిపాడు అభివృద్ధికి కృషి చేస్తా
మారుమూల గ్రామం నుంచి మండల పరిషత్ పీఠం వరకు ఎస్‌టీఆర్ ప్రస్థానం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర సహకారంతో మండల అభివృద్ధికి ప్రాధాన్యం
హనుమంతునిపాడు, మేజర్ న్యూస్ : మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించి రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ప్రజల మధ్య ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్) హనుమంతునిపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ నాయకత్వం ప్రోత్సాహంతో మండల పరిషత్ పీఠాన్ని అధిష్ఠించిన ఆయన, మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. హనుమంతునిపాడు మండల పరిధిలోని హనుమంతాపురం గ్రామానికి చెందిన సానికొమ్ము పెద్దవెలుగొండారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులకు 1974 జనవరి 1న తొలి సంతానంగా తిరుపతిరెడ్డి జన్మించారు. చిన్ననాటి విద్యాభ్యాసాన్ని అమ్మమ్మ ఊరైన కూటగుండ్ల గ్రామంలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు కొనసాగించారు. అనంతరం తురకపల్లి గ్రామంలోని సీతారాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. కనిగిరి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, పొదిలి ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, కావలిలో బీఈడీ విద్యను అభ్యసించారు. 1998, 2000, 2002 డీఎస్సీ పరీక్షలకు హాజరై స్వల్ప మార్కుల తేడాతో ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత సాధించలేకపోయారు. అనంతరం 2002 ఆగస్టు 28న దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రజనీని వివాహం చేసుకున్నారు. విద్యాభ్యాసం అనంతరం రాజకీయాల్లో చురుగ్గా అడుగులు వేసిన తిరుపతిరెడ్డి 2004 నుంచి 2009 వరకు మండల స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించారు. 2006లో హనుమంతాపురం గ్రామ వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించడంతో పాటు గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ హనుమంతాపురం పంచాయతీని మండలంలో ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆశీస్సులతో 2021లో హనుమంతునిపాడు మండల టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. 2021 జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణతో పోటీ చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా పార్టీ కోసం పనిచేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు సమయంలో 54 రోజులపాటు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని పోరాటం సాగించారు. ఈ క్రమంలో పోలీసు కేసులను సైతం ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల్లో సుమారు 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీకి 2024 ఎన్నికల్లో మెజారిటీ 501 ఓట్లకు తగ్గడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు కృషి చేశారు. హాజీపురం చెరువుకు రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యేలా చొరవ చూపడంతో పాటు పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణానికి కృషి చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగుగా ముప్పాళ్లపాడు ఎంపీటీసీ స్థానం నుంచి తిరుపతిరెడ్డి, నందనవనం ఎంపీటీసీ స్థానం నుంచి ఆయన సతీమణి రజనీ పోటీ చేసి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సానికొమ్ము తిరుపతిరెడ్డి హనుమంతునిపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీపీ పదవిని చేపట్టే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మండల ప్రజలందరికీ పేరుపేరునా నమస్కారాలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మండలంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆయన తండ్రి ముక్కు నర్సారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.