కళ్యాణదుర్గంలో కుదరని సయోధ్య.. మళ్లీ వాయిదా పడ్డ ఎంపీపీ ఎన్నికలు.
**కళ్యాణదుర్గం:** కళ్యాణదుర్గం మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎంపీపీ పీఠం కోసం ఒకే పార్టీలోని ఇద్దరు మహిళా ఎంపీటీసీ సభ్యుల మధ్య నెలకొన్న పోటీకి తెరపడకపోవడంతో ఎన్నికల ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. పరస్పర అంగీకారంతో సమస్యను పరిష్కరించేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ సయోధ్య కుదరకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ధనుంజయనాథ్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎన్నికల్లో పాల్గొనాల్సిన ఎంపీటీసీ సభ్యులు ఎవరూ కార్యాలయానికి హాజరుకాకపోవడంతో అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకు వారి రాక కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈ పరిణామాలను జిల్లా ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి నుంచి ప్రత్యేక అధికారులు వచ్చిన అనంతరమే తదుపరి ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, కళ్యాణదుర్గం ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు దురదకుంట ఎంపీటీసీ సభ్యురాలు గంటా శశికళ, తూర్పుకోడిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సింధుశ్రీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఎంపీపీ పదవిపై పట్టుదలగా ఉండటంతో నాయకత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. తొలుత పార్టీ అధిష్ఠానం ఒకరి పేరును ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, అనంతరం మరో అభ్యర్థి పేరు తెరపైకి రావడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఆశించిన ఫలితం లభించలేదు. చివరకు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్ల పాటు ఎంపీపీ పదవిని కేటాయించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. అయినప్పటికీ ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నికకు హాజరుకావాల్సిన ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి రాకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మధ్య నెలకొన్న పదవీ పోరు కారణంగా ఎన్నికల ప్రక్రియ రెండోసారి వాయిదా పడటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరోవైపు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల అధికారుల తదుపరి నిర్ణయంతోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా? లేక ఎంపీపీ పీఠం కోసం పోటీ మరింత ముదురుతుందా? అన్నది వేచి చూడాల్సి ఉంది.