ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తా
గుడిపల్లి మేజర్ న్యూస్:-గుడిపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) మీనాక్షి హేమాంబర్ గౌడ్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతోపాటు ఉప అధ్యక్షురాలుగా దేవీబెట్టప్ప నాయుడు మండలంలోని 13 మంది ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎంపీపీ మీనాక్షి హేమాంబర్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఎంపీపీగా బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పదవి అనేది హోదా కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. గుడిపల్లి మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.ముఖ్యంగా తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని, తనకు సహకారం అందించాలని ప్రజలను కోరారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మండల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కుప్పం సమన్వయ కమిటీ కన్వీనర్ భవాని చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మునిరాజు, మాజీ జడ్పీటీసీ బేటప్ప నాయుడు, పీఏ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఎంపీపీ, ఎంపీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు.
సూర్య రిపోర్టర్: లెనిన్ బాబు గుడిపల్లి మండలం