ప్రచురణార్థం — Tirupati 04.10.2026 పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి శ్రీసిటీలోని టిల్ ఫార్మా పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలి: సీఐటీయూ రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ తిరుపతి: సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్ హెల్త్
సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఐదుగురు కార్మికులు మృతి చెందడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని ఏ పరిహారమూ భర్తీ చేయలేదని, అయినప్పటికీ ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సరిపోవని, రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ, నాయుడుపేట ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒక పరిశ్రమలో మూడుసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్తినష్టం, కార్మికులకు తీవ్ర గాయాలు సంభవించాయని గుర్తుచేశారు. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం ఇచ్చి చర్యలు కోరినా, పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక కోడ్‌లతో గతంలో ఉన్న భద్రతా నిబంధనలు బలహీనపడ్డాయని, యాజమాన్యాలు తమ భద్రతా ప్రమాణాలను తామే ప్రకటించుకునే విధానం ప్రమాదకరమని మురళి విమర్శించారు. పరిశ్రమల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే లాభాల కోసం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ధోరణిని అడ్డుకోవాలని అన్నారు. మానవహక్కుల సంఘాలు, కార్మికశాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరించినప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించగలమని పేర్కొన్నారు.టిల్ పరిశ్రమ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ధర్నా నిర్వహించనుందని మురళి తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎస్. జయచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర కార్యదర్శి బుజ్జి, నగర అధ్యక్షులు పార్ధసారథి, నగర నాయకులు వేణుగోపాల్, వాసు, రఘు, శ్రీరాములు, ఎం.డి. శ్రీనివాసులు, మురళి, రాధాకృష్ణ, దాసు, వి ఎస్ మన్యం పాల్గొని ప్రసంగించారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి