పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి
- మహిళా శిశుసంక్షేమ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ
- కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి
మదనపల్లె : పోషకాహారంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కలెక్టర్ నిషాంత్ కుమార్ పేర్కొన్నారు.జిల్లాలో సెప్టెంబర్ 9 నుంచి నిర్వహిస్తున్న పోషణ్ మాసం కార్యక్రమాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభయాన్ కార్యక్రమం నిర్వహించారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి కలెక్టర్ నిశాంత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూపోషకాహార లోపం నివారణతోపాటు మహిళలు,చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు,టీచర్లు,హెల్పర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.గ్రామీణ స్థాయిలో పోషకాహారంపై అవగాహనతో పాటు బాల్య వివాహాల నివారణ,టీనేజ్ గర్భధారణల నియంత్రణ,మలేరియా,కోవిడ్ తదితర అంశాల్లోనూ సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.చిరు ధాన్యాలను ప్రజల రోజువారీ ఆహారంలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అంగన్‌వాడీ పరిధిలోని లబ్ధిదారుల కుటుంబాల్లో
వారానికి కనీసం రెండు,మూడుసార్లు చిరుధాన్యాలు తీసుకుంటున్నారా,తీసుకోకపోతే కారణాలేమిటో గుర్తించి తగిన కార్యాచరణ చేపట్టాలని సూచించారు.బాల్య వివాహాలు,టీనేజ్ గర్భధారణలు ఆందోళన కలిగించే అంశాలని,18 ఏళ్ల లోపు గర్భధారణలను నియంత్రించేందుకు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు,టీచర్లు,కార్యకర్తలు,హెల్పర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చిన్నారుల సంరక్షణ,వారి భవిష్యత్ నిర్మాణంలో అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అమూల్యమన్నారు.మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి శాశ్వత భవనాలు నిర్మించాలని కలెక్టర్‌ను కోరారు.సొంత భవనాలు అందుబాటులోకి వస్తే చిన్నారులకు మరింత మెరుగైన వసతులు కల్పించవచ్చన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించి రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టిందన్నారు.అనంతరం కలెక్టర్,ఎమ్మెల్యే గర్భిణులకు శ్రీమంతం,చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించి వారిని ఆశీర్వదించారు.
అన్నమయ్య జిల్లాకు స్వచ్ఛ అంగన్‌వాడీ అవార్డులు
ఉత్తమ పరిశుభ్రత,పారిశుధ్య నిర్వహణ,పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించినందుకు అన్నమయ్య జిల్లాకు చెందిన
మదనపల్లి బసినికొండ-2 అంగన్‌వాడీ వర్కర్ విజయ లక్ష్మీదేవి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
పుంగనూరు-గూడూరుపల్లి అంగన్‌వాడీ కేంద్రం టి.నాగరత్నమ్మ,వాల్మీకిపురం-4 అంగన్‌వాడీ కేంద్రం ఎస్.నజమున్నిసా,పీలేరు-ఎర్రంరెడ్డికుంట అంగన్‌వాడీ కేంద్రం జి.కళావతి,కురబలకోట-2 అంగన్‌వాడీ కేంద్రం ఎ.లలితమ్మలు జిల్లాస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు.అంగన్‌వాడీ ఉత్సవ్,పోషణ్ మా కార్యక్రమాల నిర్వహణలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయడంలో విశేషంగా కృషిచేసిన
బి.కొత్తకోటకు చెందిన పి.అంజలమ్మ,లక్కిరెడ్డిపల్లికి చెందిన టి.నాగరాణి,మదనపల్లికి చెందిన డి.ఆర్.మధురవాణి,పీలేరుకు చెందిన ఎస్.అన్నపూర్ణ,పుంగనూరుకు చెందిన జి.రోజా,రాయచోటికి చెందిన ఎన్.ఓబులమ్మ,తంబళ్లపల్లికి చెందిన మిరియాల రమాదేవి,వాల్మీకిపురానికి చెందిన ఎం.గులాబ్జన్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా దుశ్శాలువాతో సత్కరించి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా జ్ఞాపికలు అందజేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ హైమవతి,సీడీపీవోలు సుజాత రెడ్డి,నాగవేణి,రాజేశ్వరి,భారతి,రెడ్డి రమణమ్మ,భాగ్యమ్మ, అంగన్‌వాడీ,ఆశా కార్యకర్తలు,ప్రజాప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కె.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి