సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం
రాత్రివేళ వాహనదారుల అవస్థలు.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
తాడిగడప, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నేరుగా తాడిగడప 100 అడుగుల రోడ్డుకు చేరుకునేందుకు కీలకమైన సిద్ధార్థ కళాశాల ఫ్లైఓవర్‌పై రాత్రివేళ చీకట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో రాత్రివేళ రాకపోకలు అధికంగా ఉంటాయి. గతంలో సుమారు 80 శాతం పనులు పూర్తయిన ఈ వంతెనను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ కళాశాల యాజమాన్యం సహకారంతో పూర్తి చేసి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఫ్లైఓవర్‌పై శబ్ద కాలుష్య నివారణకు ఇరువైపులా ఇనుప బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో రాత్రివేళ చిమ్మచీకటి నెలకొంటోంది. ఇటీవల రెండు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. పగటివేళ సౌకర్యవంతంగా ఉండే ఈ మార్గం రాత్రివేళ ప్రమాదకరంగా మారుతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
✍️ప్రేమ్ రాజ్, తాడిగడప, కృష్ణాజిల్లా.