పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఘన విజయం.. పార్టీ శ్రేణుల్లో సంబరాలు
సీతానగరం నవంబర్ 27 మేజర్ న్యూస్: పార్వతీపురం నియోజకవర్గ పరిధిలోని సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గణనీయ సంఖ్యలో విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం పార్వతీపురంలోని టీడీపీ కార్యాలయం సందడిగా మారింది. ఆయా మండలాల నుంచి తరలివచ్చిన విజేతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విజేతలను పేరుపేరునా అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాల్చి తమ విజయోత్సాహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి చాటిచెప్పాయని పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆయా పంచాయతీల సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. తద్వారా పార్టీకి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం పంచాయతీలకు నిధులు విడుదల కానున్నాయని, నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.