పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలే ప్రధానం.. సొంట్యాంలో "ప్రజలతో ముఖాముఖి"
ఆనందపురం, మేజర్ న్యూస్ : పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజలు ఎటువంటి గొడవలకు, వివాదాలకు తావివ్వకుండా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో "ప్రజలతో ముఖాముఖి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆనందపురం మండలం, ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సొంట్యాం గ్రామంలో ప్రజా వేదిక వద్ద మంగళవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీసు అధికారులతో నేరుగా తమ సమస్యలు, సందేహాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీస్, డీసీపీ (జోన్-1) మణికంట చాందోలు, ఏసీపీ (నార్త్ సబ్ డివిజన్) ఎస్. అప్పలరాజు, ఆనందపురం సీఐ ఎర్ర నాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ హాజరై పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై గ్రామ ప్రజలతో నేరుగా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ డా. శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఎంతో కీలకమైనవని, వీటిని పండగలా, ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చిన్న చిన్న వివాదాలు పెద్ద గొడవలుగా మారకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
గ్రామాల్లో గొడవలు, వివాదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, గొడవలకు దిగితే, బెదిరింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓటర్లు ఎవరి ప్రలోభాలకు లోనుకాకుండా, మద్యం, డబ్బు ఆశ చూపిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం గ్రామస్తులు తమ గ్రామంలో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వాటిని సావధానంగా విని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.